ముంగిలి » సాధారణమైనమి » రైలులోంచి

రైలులోంచి

వేపకొమ్మల దూసుకుంటూ
ఈత మట్టల నెక్కి దిగుతూ
రైలు కిటికీ దూరి వెనుకకు
గాలి జారింది !
మదపుటేన్గుల లాంటి కొండలు
ఎలుగుబంటులలాంటి గుట్టలు
రైలు కూతను వినీ వినకే
నిలచి ఉన్నాయి.
బూమి దాచిన పంట వెతుకుతు
నడిచిపోయే రైతు నాగలి
నల్లరాళ్ళకు జంకిపోతూ
నిలచిపోయింది !
పరుగులెత్తే గిత్తదూడను
చూసి చూడక రైలు ఇంజను
గుప్పుగుప్పున పొగలు చిమ్ముతు
పారిపోతోంది.!