చివరకు మిగిలింది!

చివరకు మిగిలింది!

డా.మిరియాల రామకృష్ణ

(రంగు రంగు రత్న దీపాల నుండి )

చివరకు మిగిలింది!

తీయ మామిడి చెట్ల తోటకు

తీరుబడి అయినప్పుడ్ల

పోయి తిరగడమందు నాకేదో

హాయిగా ఉంది!

చెట్ల కొమ్మలకేసి చూస్తూ

చేతితోనే అందుకుంటూ

నీడలందే తిరిగి యింటికి

నేను పోతాను!

కొన్ని నాళ్ళకు మావి చెట్టుల

కొమ్మలన్నీ చిగురు వట్టెను!

చిగురులన్నీ ఆకులవుతూ

చెరిపివేసెన  ఎఱ్ఱ రంగును!

కొన్ని నాళ్ళకు మావిచెట్టుల

కొమ్మలన్నీ పూలు పూచెను!

మావి పివ్వులు పిందెలవుతూ

మారిపోతూ కానుపించెను!

కొన్నినాళ్ళకు పిందెలన్నీ

గుంజు నిండిన కాయలయ్యెను!

మావికాయలు దోరముగ్గుతు

మనిషి చెతికి అందిపోయెను!

చిగురుటాకుల ఎఱ్ఱరంగులు

చెరిగిపోనే లేదు నాలో!

మావిపిందెల పచ్చదనములు

మాయమే కాలేదు నాలో!

నిజం — సత్యం — మూసేసారా??

నిజం అని ఒక బ్లాగు ఒకాయన యాసిర్ పేరు తో మొదలుపెట్టారు.
తరువాత సత్యం అనే పేరు తో నాసిర్ పేరు తో పైన దానిలో చెప్పిన విషయాలు ఖండిస్తూ మెదలు పెట్టారు.

రెండు బ్లాగుల్లోవీ వివాదాస్పద అంశాలే. కొంత డిష్కషను తరువాత రెండో బ్లాగు ని మూసేసారు. రెండోది మూసేసారు కనుక నేను కూడా మూసేస్తున్నానని మొదటిది కూడా మూసేసారు.

మూసి వేయడం వాళ్ళ ఇష్టం కరక్టే . ఎందుకు మూసేసారు??
—మీకెందుకూ అంటారా? మూసివేయడమే సరి అంటారా??
————–
బ్లాగుల్లో కొత్త పోకడలను చూస్తున్నాం గత కొన్ని వారాలుగా . కొత్త వ్యక్తులతో పాటు గా కొత్త,వింత భావనలు అవి మంచివైనా ,చెడ్డవైనా.

అన్నీ యివి వెన్నెలలా?

అన్నీ యివి వెన్నెలలా?

డా.మిరియాల రామకృష్ణ

(రంగు రంగు రత్న దీపాల నుండి )

అన్నీ  యివి వెన్నెలలా?

ఆకాశం ఆవుపాలు

అన్ని యివి వెన్నెలలా?

చీకటి కుంకుడు నురగలు

చిక్కనివి వెన్నెలలా?

నల్లని మబ్బుల తలలో

నవ్విన పువ్వులు కావా?

జాబిలి ఒడి లో నుండియె

జారిన బియ్యం కావా!

చుక్కలు కొట్టిన బియ్యపు

చక్కని పిండి యిదేమో !

తూరుపు పాపల పెదవుల

జారిన నవ్వులివేమో !

మిరా(మిరియాల రామకృష్ణ)  గారు తన కలల నిలయానికి  వెన్నెల అనే చక్కని పేరు పెట్టుకున్నారు.

చుక్క ఎగిరి వస్తున్నది!

చుక్క ఎగిరి వస్తున్నది!

డా.మిరియాల రామకృష్ణ

(రంగు రంగు రత్న దీపాల నుండి )

చుక్క ఎగిరి వస్తున్నది!

చీకటి లో దీపంలా

చెక్కిలి పై కోపంలా

అందంగా మెఱిసిందీ

అంతలోనే ఆరిందీ!

ఇంచక్కా ఎగిరిన ఓ

మంచి మిణుంగురుపురుగా!

ఎవరు తప్పిపోయారే?

ఎంతసేపు వెదికావే?

చుక్క ఎగిరివస్తున్నది

చూశావా చెల్లీ!

తళుకు లారిపోకుండా

దాద్దామా తల్లీ!

ఎవరమ్మా??

ఎవరమ్మా??

డా.మిరియాల రామకృష్ణ

(రంగు రంగు రత్న దీపాల నుండి )

ఆకాశం పై మబ్బుల కంబళి

అమ్మా ! వేశారెవరే?

ఉరుమురధముపై హోరునపోయే

పౌరులెవ్వరే అమ్మా !

మెరుపు పాములను మెల్లమెల్ల గా

లాలించేవారెవరమ్మా!

తూనీగల గాలిపటాలను

ఎగరవేసినారెవరమ్మా!

పచ్చగడ్డిపయి ఆణిముత్యములు

పారబోసినా రెవరమ్మా!

మబ్బులపై ఆ యేడురంగులను

జల్లివేసినారెవరమ్మా!