చివరకు మిగిలింది!
డా.మిరియాల రామకృష్ణ
(రంగు రంగు రత్న దీపాల నుండి )

తీయ మామిడి చెట్ల తోటకు
తీరుబడి అయినప్పుడ్ల
పోయి తిరగడమందు నాకేదో
హాయిగా ఉంది!
చెట్ల కొమ్మలకేసి చూస్తూ
చేతితోనే అందుకుంటూ
నీడలందే తిరిగి యింటికి
నేను పోతాను!
కొన్ని నాళ్ళకు మావి చెట్టుల
కొమ్మలన్నీ చిగురు వట్టెను!
చిగురులన్నీ ఆకులవుతూ
చెరిపివేసెన ఎఱ్ఱ రంగును!
కొన్ని నాళ్ళకు మావిచెట్టుల
కొమ్మలన్నీ పూలు పూచెను!
మావి పివ్వులు పిందెలవుతూ
మారిపోతూ కానుపించెను!
కొన్నినాళ్ళకు పిందెలన్నీ
గుంజు నిండిన కాయలయ్యెను!
మావికాయలు దోరముగ్గుతు
మనిషి చెతికి అందిపోయెను!
చిగురుటాకుల ఎఱ్ఱరంగులు
చెరిగిపోనే లేదు నాలో!
మావిపిందెల పచ్చదనములు
మాయమే కాలేదు నాలో!




